‘నేను సైతం’

మానస వీణని శ్రుతి చేసి మధురరాగాలు పలికిస్తూ అనంత సౌరభాలు వెదజల్లే నిషిగంధ ఈ గ్లోబోళ జంభపై తనదైన శైలిలో యుద్ధం ప్రకటిస్తున్నారు చూడండి.
*** *** ***

అదొక బద్దకపు వారాంతపు సాయంకాలం..
చెయ్యాల్సిన పనులెన్నో ఉన్నా .. అసలు ఉండాల్సిన మూడ్ లేక, లాప్ టాప్ ముందేసుకుని యూట్యూబ్ లో ఏవేవో పాటల కోసం వెతుకుతున్నా..
అనుకోకుండా నాకు చాలా ఇష్టమైన ‘అమృత’ తమిళ్ సినిమాలో సత్తెన ననైదదు
ఆ వీడియో చూస్తూ ఎక్సైట్ అయిపోయి, పక్కనే టివి చూస్తున్న మావారిని ఒక పోటు పొడిచి “చూడండి మీరు అచ్చు ఇలానే మీ అక్క ముందు నన్ను..” అంటుండగానే శంకరాభరణం శాస్త్రి గారు “శారదా” అని అరిచినట్లు “ష్ష్ ష్ష్” అని గట్టిగా విసుక్కున్నారు. అంత ముఖ్యమైన ప్రోగ్రాం టివిలో ఏమొస్తోందా అని నేనూ తల తిప్పి చూశాను. National Geographic channel లో గ్రీన్ లాండ్ లో ఉన్న ఐస్ ఇదివరికటి కంటే వేగంగా కరిగిపోతుందని, కారణం గ్లోబల్ వార్మింగ్ అనీ చూపిస్తున్నారు.

ఎంత కోపమొచ్చిందనీ!! ‘ఎక్కడో ఐస్ ముక్కలవుతుందని పక్కనే ఉన్న నన్ను కసురుకుంటారా.. కాసేపట్లో “డిన్నర్ ఏంటోయ్” అని కొంగు పట్టుకుంటారుగా అప్పుడు చెప్తాను ‘ అని కచ్చిగా అనుకున్నా.

కానీ, ఒక్క క్షణం పాటే చూసినా, టివిలోని దృశ్యం నన్ను నిలువనీయలేదు. నేనూ వెళ్ళి టివి చూడటం మొదలుపెట్టాను. మైళ్ళకి మైళ్ళు విస్తరించి ఉన్న ఐస్ పెళ్ళలు పెళ్ళలుగా విరిగి సముద్రంలో కలిసిపోతుంది.. ఇంత వేగంగా కరగడం వలన సముద్రంలో నీటిమట్టం అనూహ్యంగా పెరిగిపోతుందని చెప్తున్నాడు.

ప్రోగ్రాం అవ్వగానే ప్చ్ అని పెద్దగా నిట్టూర్చడంతో నా కర్తవ్యం ముగించి ఇంకో ఛానెల్ కి మార్చుకున్నాను.

మనలో చాలా మందికి ఇలాంటి పర్యావరణ సమస్యల మీద పెద్ద అవగాహన ఉండదు. ఉన్నా దాని తీవ్రతని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించం. కారణం మన దైనందిన కార్యక్రమాలు. ఏదో తప్పనిసరై ఈ సమస్యల గురించి వినాల్సి వస్తే వెంటనే బాధేస్తుంది.. ఆ క్షణంలో నవనాగరిక పౌరులుగా ఈ సమస్యా నివారణకి మనం కూడా ఏదో చేయాలి అన్న ఆవేశం వస్తుంది.. వెంటనే ఎప్పటినించో వాయిదా వేస్తున్న పని ఒకటి ఠక్కున గుర్తుకొస్తుంది.. ఉన్నట్టుండి అదెంతో ముఖ్యమనిపిస్తుంది.. ముందది పూర్తి చేసేసి తర్వాత మనసంతా పూర్తిగా ఈ సమస్య మీద పెడదాం’ అనుకుని ఆ పనివైపుకి మళ్ళుతాం! అలాగే అన్నం తింటాం, పడుకుంటాం.. లేచేసరికి ఆవేశం పోతుంది.. ‘ఆ మన ఒక్కళ్ళం ఎంత చేసి ఏం ప్రయోజనం.. జరగాల్సింది జరగక మానదు.. అయినా ఎప్పుడో జరగబోయేదానికి మన టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు.. అప్పటికి మనం ఉండొచ్చామా.. చూడొచ్చామా!!’ వేదాంత ధోరణి.. నేనూ ఇంతే! ఎప్పటినించో తెలుసు ఉష్ణోగ్రతలలో పెరుగుదల, వాతావరణంలో జరుగుతున్న అవాంఛిత మార్పులు.. అయినా ఆ సమస్యపై దృష్టి పెట్టింది లేదు!

టివి లో ప్రోగ్రాం చూస్తున్నప్పుడు ఏమీ అనిపించలేదు కానీ ఆ రాత్రి పడుకునేప్పుడు, కరిగి నీరవుతూ సముద్రంలో కలిసిపోతున్న మంచు గురించి ఆలోచిస్తుంటే మన వెండి కొండలు హిమాలయాలు గుర్తొచ్చాయి. భవిష్యత్తులో మన తరువాతి తరాలవారు పైనించీ కిందవరకూ మాస్క్ లు ధరించి (ఆదిత్య 369 చివర్లో చూపించినట్లుగా) ఆ పర్వతాల వైపు చూస్తూ ‘ఒకప్పుడు ఇవి మంచుతో కప్పబడి ఉండేవంటా!’ అని మనం ఇప్పుడు గుప్తుల స్వర్ణయుగం గురించి మాట్లాడుకున్నట్లు అనుకుంటారేమో అనిపించింది! వెంటనే అదో రకమైన భయం!! పచ్చదనం, సెలయేర్లు ఇవన్నీ కేవలం పుస్తకాల్లో మాత్రమే చూసే రోజు రాదు కదా!! ఇంకా భయం వేసింది!! అప్పుడు మొదలుపెట్టింది నా మనసు సరిగ్గా ఆలోచించడం..

ఈ పర్యావరణ సమస్య మీద మన వాళ్ళకి, మన చుట్టూ ఉన్నవాళ్ళకి ఏమాత్రం అవగాహన ఉందో తెలుసుకోవాలి.. వారికి సమస్య తీవ్రతని తెలియజేయాలి.. దానికి ‘బత్తీ బంద్ ‘ లాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి.. అప్పుడు కూడా ఊరికే దీపాలార్పేసి కూర్చోకుండా పిల్లలకి, తెలియని వాళ్ళకి ‘గ్రీన్ హౌస్ వాయువులు’ లాంటి విషయాల గురించి చెప్తూ చర్చ చేయాలి. మొన్నొకరోజు వర్క్ లో మా గ్రూప్ అంతా లంచ్ కి వెళ్ళినప్పుడు ఈ సమస్యకి వాళ్ళే విధంగా స్పందిస్తున్నారని అడిగాను. ప్రతి ఒక్కళ్ళూ నీళ్ళు నమిలినవాళ్ళే! నెమ్మదిగానే అయినా, ఉత్సాహంగా మా ఇంట్లో మా దైనందిన చర్యలో చేసిన చిన్న చిన్న మార్పుల గురించి చెప్పాను. Energy efficient బల్బులు వాడటం, ఇంట్లో ఉన్న అనవసరమైన ఎలెక్ట్రికల్ వస్తువులను (ఉదాహరణకి టేబుల్ టాప్ వాటర్ ఫౌంటైన్, సీనరీ ఛేంజ్ అయ్యే వాల్ ఫ్రేం, లాంటివి) తీసివేయడం, మావారు 3, 4 పాటలు పాడుకుని గానీ పూర్తిచేయని స్నానాన్ని ఒక్క పాటతో అవజేయడం, టైం సేవ్ చేద్దామంటూ చిన్న చిన్న పనులకు కూడా చెరో కార్లో వెళ్ళడం ఆపేసి ఇద్దరం కలిసి వెళ్ళడం, గార్డెన్ లో మామూలు ఎలెక్టిక్ లైట్స్ తీసేసి సోలార్ లైట్స్ పెట్టడం ఇలా చిన్న చిన్న మార్పులే అయినా మనసులో ‘నేను సైతం’ అన్న సంతృప్తి!! నేను అమ్మకి చెప్పాను ‘లక్ష్మీదేవి తిరుగుతుందని ఇల్లంతా లైట్లు వేసుకుని కూర్చోకూ’ అని. వచ్చే నెలలో హైదరాబాద్ లో జరగబోయే బత్తీబంద్ గురించి చెప్పి మీ అపార్ట్ మెంట్లో కూడా అలాంటివి జరిగేటట్లు చూడమని చెప్పాను.

ఈ సమస్యని ఎదుర్కోవడం ఎప్పుడో కాదు ఇప్పటి నించే, ఎక్కడినించో కాదు ముందు నా ఇంటినించే అని ప్రతి ఒక్కరూ అనుకునే రోజు, అదీ వీలైనంత తొందరగా రావాలి. మంచినీళ్ళు కొనుక్కుని తాగడం మా అమ్మమ్మకి ఇప్పటికీ మింగుడుపడని విషయం. మన ముందు తరాల వారు గాలిని కొనుక్కునే రోజుల్ని మన కళ్ళతోనే చూసే పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను.

కొసమెరుపు: నేను ఎంతో ఉత్సాహంగా చూపించబోయిన పాటని ‘ష్ష్’ అని చిరాకుపడుతూ ఆపేసిన మావారికి ఆ తర్వాత నా నించి ఎన్ని ‘ఊహూ’ లు వచ్చుంటాయో ఊహించమని ప్రార్ధన. మరి గ్లోబల్ వార్మింగ్ గురించి చెప్పేటప్పుడు చల్లగా చెప్పాలి కానీ అలా మండిపడితే పనులవుతాయా!!

Advertisements

అవని ఏమంది?

కేంద్రపాలిత ప్రాంతం యానాం నించి ఈ మధ్యనే బ్లాగువనంలో తనకవితా గళం విప్పిన కోకిల బొల్లోజు అహ్మదలీ బాబా గారు .. ఈ అవని ఏమన్నదో వినమంటున్నారు.

అవని ఏమంది?

చిల్లులు పడిన ఒజోను దుప్పటిని కప్పుకుని
పీలికలైన పచ్చని చీరను చుట్టుకొని
నీళ్లలో తడిచి ఒరిసి పోయిన పాదాలతో
తీవ్రమైన జ్వరంతో వణుకుతున్న
అవని ఏమంది?

కుచించుకుపోతున్న అడవులు
వాహనాలు వెదచిమ్ముతున్న విషాలు
ఎడారులయ్యే పంటభూములు
తీరాలను ముంచెత్తే సాగరాలు
వ్రణాలు పడుతున్న పర్యావరణం…….
బిడ్డా ……. కళ్లుతెరు…. కళ్లుతెరు అంది.

అవని ఏమంది?
సూర్య, పవన, జలశక్తులను మచ్చిక చేసుకొని
రాక్షసబొగ్గు రాక్షసత్వానికి దూరంగా ఉండమంది.

నడక, సైకిలు, ప్రజారవాణా వ్యవస్థల ద్వారా
శిలాజ ఇంధన హోమాన్ని నిలువరించమంది.

స్విచ్ ఆఫ్ చేసినా, స్టాండ్ బై లో ఉంచినా
పరికరాలు పీల్చుకొనె లవలేశ శక్తినీ
అన్ ప్లగ్ చేసి అరికట్టమంది.

ఫిలమెంటు బలుబుల వేడి వెలుగు స్థానంలో
ఫ్లోరెసెంట్ కాంతుల వెన్నెలను పూయించమంది.

స్విచ్ నైనా, కుళాయినైనా, “అయితే ఏంటటా?” అనే నిర్లిప్తతనైనా,
లేచి వెళ్లి కట్టేయటానికి బద్దకించవద్దన్నది.

అవని ఏమంది?
నియంత్రించబడలేని విషవలయంలోకి పోయి
మిమ్మల్ని మీరే తొలగించుకోవద్దంది.

ఒక్క క్షణం ఆపమంది
ఉక్కిరిబిక్కిరవుతున్న తాను
ఊపిరి తీసుకోవటానికి.
ఒక్కక్షణం ఆర్పమంది
ఎక్కుతున్న తన కంఠం
గుక్కతిప్పుకోవటానికి

అవని ఏమంది?
ఒక్కక్షణం ఆపమంది
ఒక్కక్షణం ఆర్పమంది.
ఒక్కక్షణం ఆపమంది
ఒక్కక్షణం ఆర్పమంది.

టైం: … యుద్ధం తరువాత నూటనలబయ్యో సంవత్సరం

(తన కథని ఈ బత్తీ బంద్ కి చెందిన బ్లాగులో ఉంచేందుకు అనుమతినిచ్చిన చావా కిరణ్ గారికి కృతజ్ణ్జతలు:)

టైం: అద్దమ రేయి పదకొండు గంటల నలబై అయిదు నిమిషాలు: జూన్ ఇరవై అయిదు: యుద్ధం తరువాత నూటనలబయ్యో సంవత్సరం

మరొక్కసారి డిజీగ్రాఫ్ చూసుకున్నాడు. తనకు ఈ థీమ్ బాగా నచ్చినది.

రేపే చివరి రోజు ఈ అసైన్మెంటు సబ్మిట్ చేయడానికి. మరొకసారి చదవసాగినాడు.

== మానవీయ కోణంలో సాంకేతికాభివృద్ధి. ==

సాంకేతికాభివృద్ధి మొదటి నుండి పొగడ్తలు, విమర్శలు సమానంగా అనుభవించినది తిట్టేవాళ్ళు మొదటి మహా యుద్ధం, రెండవ మహా యుద్ధం, అంతకు ముందటి మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం లలో జరిగిన ప్రాణ నష్టంలను ఉదాహరణగా చూపిస్తారు. పొగడేవాళ్ళు ఆహార భధ్రత, సుఖ జీవనం వంటివి ఉదాహరణగా చూపిస్తారు.

నిజానికి సాంకేతికాభివృద్ధి అనేది రెండువైపులా పదును ఉన్న కత్తి లాంటిది. దీనిని ఉపయోగించడం మన చేతుల్లోనే ఉన్నది ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. ఈ వ్యాసంలో నేను రెండు ఉదాహరణలు వివరంగా ఇచ్చి ఈ విషయంపై మరింతగా చివరి అధ్యాయంలో చర్చిస్తాను. ఓ ఐడియా రావడం కోసం ఆ రెండు ఉదాహరణలు నాలుగు ముక్కల్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను.

== బెంగాల్ కరువు ==

యుద్ధం ముందు ఐదవ శతాబ్ధంలో వచ్చిన కరువు ఇది, ఈ కరువుకి కారణమూ సాంకేతికాభివృద్ధే, దానిని తొలగించినదీ సాంకేతికాభివృద్ధే. సాంకేతికాభివృద్ధి వల్ల బ్రిటీషు వాళ్ళు (ప్రస్తుతము యూరోలో ఓ కౌంటీ) భారత దేశాన్ని పాలించ గలిగినారు, ఇటువంటి పాలన వల్ల నీలి మందుకు డిమాండు బాగా పెరిగినది దానితో బెంగాలులో రైతులను కేవలము నీలి మందు మాత్రమే పండించమని ఫోర్సు చేసినారు. దాని వల్ల ఆహార పంటలకు తీవ్రమైన కొరత వచ్చి జనాలు ఆహారము లేక పలు పలు విధములైన కష్టాలు పడినారు. ఎన్నో లక్షల మంది మరణించినారు.

ఇటువంటి దుర్బిక్ష పరిస్తితులనుండి జనులను కాపాదింది కూడా సాంకేతిక రంగములోని అభివృద్ధే! తరువాత కొన్ని సంవత్సరాలకు నీలిమందు కృత్రిమంగా తయారు చేయడం కనుగొనబడినది, తద్వారా రైతులు మరళా ఆహార పంటలు పండించుకోగల్గినారు!

ఈ మొదటి ఉదాహరణ నుండి మనకు తెలిసిన విషయము ఏమిటంటే సాంకేతికాభివృద్ధి రెండువైపులా పదును ఉన్న కత్తి లాంటిది అని దానిని ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు అని!

== అటో కరువు ==
ఇది బెంగాల్ కరువు తరువాత సుమారుగా మూడు వందల సంవత్సరాలకు వచ్చినది, దీనిని ఆటో కరువు (కారణాలు వివరంగా తరువాత చాప్టర్లలో చెప్పబడినది) లేదా మూడవ ప్రపంచపు కరువు అని పిలుస్తారు.

=== అసలు ఏమి జరిగినది? ===
సాంకేతిక రంగంలోని మరో అభివృద్ధి వల్ల ఆహార ధాన్యాల నుండి , ముఖ్యముగా మొక్క జొన్న, జొన్న, వరి, గోధుమ … మరియు పది ఇతర రకాలైన వాటినుండి తయారు చేసిన రసాయనాలతో వాహానాలు నడపడం లాబదాయకం చేయబదినది, పెట్రోలు డీజిలు వంటివి వాడే అన్ని వాహనాలూ కూడా ఇలా ఈ ఆహార రసాయనాలతో నడపడం మొదలు పెట్టినారు! దీని ద్వారా ఒక్కసారిగా ఆహరం కొరకు డిమాండు పెరిగిపొయినది! పంటలు అన్నీ ఆటోలకే ఆహారంగా వెళ్ళసాగినాయి, రీసెర్చి మొత్తం దానికోసమే జరిగినది, దాని వల్ల అంతంత మాత్రంగా ఉన్న వివిధ దేశాల ఆహార భధ్రత పూర్తిగా ప్రమాదంలో పడినది, ఇహ అప్పటికే కరువు కాటకాలతో, అంతర్యుద్ధాలతో సతమతమవుతున్న మూడవ ప్రపంచ దేశాలు పూర్తిగా కరువు కోరల్లోకి జారుకున్నాయి. ఆహారం రేట్లు ధనిక దేశాల్లో కూడా దిగువ మధ్య తరగతి, పేద వర్గాలకు పూర్తిగా అందకుండా పొయినాయి. ఈ కరువు సుమారుగా యాబై సంవత్సరాలు కొనసాగినది, కొన్ని దేశాలకు దేశాలే , జాతులకు జాతులే తుడిచి పెట్టుకొని పొయినాయి, అక్రమ వలసలు విపరీతంగా పెరిగి ప్రపంచంలోని దేశాలన్నిటికీ సమస్యలు సృష్టించినది. మొత్తం ప్రపంచ జనాభా మూడవ వంతుకు తగ్గిపొయినది! భారత దేశం, చైనా, బ్రెజిల్ చావు తప్పి కన్ను లొట్టపొయినట్టు తప్పించుకోగల్గినా వాటి సామాజిక రూపమే మారిపొయినది! (ఈ కరువుకి కార్పొరేషన్లు, వాటి కనుసన్నల్లోని మీడియా కూడా ఒక కారణం అంటారు, వాటి గురించి ఈ వ్యాసంలో చర్చించడం జరగలేదు)
ఆ తరువాత యాబై సంవత్సరాలకు బిల్డింగ్ వ్యవసాయం లేదా ఇండోర్ అగ్రికల్చరు అభివృద్దిచేయడం జరిగినది. దీనితో ఈ ఆటో కరువుకి సమూలమైన సొల్యుషన్ తయారు అయినది. మొదట ఈ బిల్డింగ్ వ్యవసాయం దుబాయిలో (ఇప్పటి డిజర్టిరో) మొదలయినది తరువాత వేగంగా ప్రపంచం మొత్తం వ్యాపించినది. ఇప్పుడు మనము తినే అన్నిరకాలయిన ఆహార పదార్థాలూ ఇండోర్ వ్యవసాయం నుండేవచ్చేవే! ఇంతకు ముందు వ్యవసాయం మొత్తం ఆరు బయట మానవ శ్రమతో చేసేవారని ఆలోచించుకుంటేనే కష్టంగా ఉన్నది. సిటీల్లోని ఎత్తైన ఇండోర్ అగ్రీ బిల్డింగులు చూస్తుంటే ప్రపంచపు చరిత్రను మార్చిన సాంకేతిక అభివృద్ధి గుర్తుకు రాక మానదు.

……
మొత్తం యాబై పేజీలు వచ్చినది.

మరొకసారి అన్ని చాప్టర్లూ సరిగ్గా ఉన్నయో లేవో చూసుకొని, బొమ్మలు, విడియోలూ, చోపుదారులు అన్నీ సరిగ్గా ఉన్నయో లేవో చూసుకొని తృప్తిగా తలాడించి పక్కకు చూసినాడు.

కరెంటు కోత – రోజూ ఓ పూట

కరెంటు కోత కరెంటు కోత అని వెతలు పడిపోతారు
కల్లబొల్లి కబురులెన్నో చెప్తారు
నాకు మాత్రం కరెంటు కోత
కావాలి రోజూ ఓ పూట
ప్రకృతి చెప్పే సంగతులన్నీ

వినగలిగేది ఈ ప్రశాంత సాయంసంధ్యలోనే