• Categories

 • Blog Stats

  • 9,939 hits
 • Advertisements

నిరంజనోపాఖ్యానం

దంచెద ఊక యని ఢంకా బజాయించి మరీ బ్లాగ్ప్రవేశం చేసిన ఊకదంపుడు, అటు ఛందోబద్ధ కవిత్వాన్నీ, ఇటు మందుబాబు తూగులయ్య పదాల్నీ, సరే ఇహ ఇంగ్లీషు యు లివ్ లాంగా అంటూ పైనా కిందా ఎడాపెడా వాయించే ఈ పెద్దమనిషికి మొన్నొకరోజున ఊహించని ఎదురు దెబ్బ తగిలిందిట.
*** *** ***
గత వారాంతం లో అనుకోకుండా నిరంజన్ దగ్గరకి వెళ్లాను. వాడిది నాది పదిహేనేళ్ల స్నేహం.
కాలేజీ లో చేరిన కొత్తల్లో పరిచయం, ఇద్దరం ఒకే క్లాసు, తనూ నాలాగే రూం వెతుక్కుంటున్నాడు, మొత్తానికి మాయాబజార్ లో ఓ పోర్షను దొరికితే, ఇద్దరం కలిసి ఉండాలని తీర్మానించుకొని అద్దెకి దిగాం.

చేరిన పదిరోజులకనుకుంటా , ఓ ఆదివారం నాడు పొద్దున పదింటికి నిద్రలేవగానే,
ఏంటి రాత్రి లైటాపకుండానే పడుకున్నావ్? అన్నాడు..
చాలాసేపు ఏదో చదువుతున్నాను, అలానే నాకు తెలియకుండా నిద్రపోయాను అన్నాను..
ఆదే రోజు సాయంత్రం, వాడు ఎక్కడికో వెళ్ళాడు, వాడు అడుగు బయట పెట్టీపెట్టగానే కరంటు పోయింది.కాసేపటికి ఏమిచేయాలో తెలియక నేను సినిమాకెళ్ళాను.
తిరిగి వచ్చిన తరువాత వాడు అడిగిన మొదటి ప్రశ్న:
లైటార్పేయకుండా బయటకు వెళ్లావ్?
కరంటు పోయినప్పుడు బయటకు వెళ్ళాను, అనుకోకుండా అటునుంచి సినిమాకి వెళ్ళాను అన్నాను
నీకు డబ్బులెక్కువైతే కరన్సీ తగలెట్టు కానీ కరంటు తగలబెట్టద్దు అన్నాడు.

కరంటు షాకు కొట్టినట్టైంది…

ఇంకో సారి, సందర్భం గుర్తు లేదు, ఎదో బేరం అనుకుంటాను, కొట్టువాడు, ౧౦ రూపాయలు చెప్పిన వస్తువు, కాసేపు బేరం జరిగిన తరువాత వీడు తొమ్మిది రూపాయలకు అడిగాడు..
రూపాయిమాత్రానికి ఏముంది తీసుకో అన్నాను…
విసా విసా బయటకు వచ్చేసాడు..

రోడ్డుపైకొచ్చిన వచ్చినతరువాత,
౯ రూపాయలు ౧౦ రూపయలు అవ్వాలంటే బాంకులో ఓ సంవత్సరం పాటు నిల్వ ఉంచాలి తెలుసా అన్నాడు.. తొమ్మిది రూపాలకు నేను కొనదల్చుకున్న వస్తువు పదిరూపాయలు కొమ్టున్నాను అంటే పదకొండు శాతం ఎక్కువ ఖర్చు పెడుతున్నాను అని అర్ధం, ఇవాళ బ్యాంకు వడ్డీ కూడా అంతలేదు అన్నాడు.

ఇంత క్రమశిక్షణ ఇంత కచ్చితత్వమూ, ఉన్న నిక్కచ్చి మనిషితో రూమ్మేట్ గా ఉండటం నా వల్లకాదని ౩ నెలలకల్ల తెలిసిపోయింది.మెల్లగా మకాం మార్చాను. ఐతే మాసవారి పరీక్షలు, అసైన్‍మెంట్లు, ఆఖరివారపు ఆర్ధికకటకట ఇత్యాది నా అవసరాలవల్ల ‘స్నేహం’ మాత్రం బానే నడిచింది.

డిగ్రీ అయిన తరువాత కలపలేదు, అమెరికా వెళ్ళి ఓ పుష్కరం ఉండీ పుష్కలంగా సంపాదిచ్చుకొని ఈ మధ్యనే స్వదేశం లో స్థిరపడదామని వచ్చాడు. ఇప్పుడు పదిహేనుయేళ్ల తరువాత మళ్లీవాడిని కలవటానికి వాళ్లింటికి వెళ్ళాను. నిజానికి నాకు వెళ్ళాలని అంత ఆసక్తి కానీ లేదు వాడి భార్య, నా భార్యస్నేహితురాలవటంచేత, ఆవిడ గత పదిరోజులలో చాలమార్లు ఈమెకి ఫొన్ చేసి రమ్మంటం వల్ల, ఈవిడ ఇవాళ వస్తున్నట్టు చెప్పటం వల్ల తప్పలేదు.
నే వెళ్లేసరికి ఏడుముప్పావయ్యింది. విశాలమైన టౌన్‍షిప్పులో ఆఫీస్ వాళ్లిచ్చిన ఫ్లాట్ లో ఉంటున్నాడు. వాడి ఫ్లాట్ ఎంట్రన్స్ దగ్గరకి వెళ్లేసరికి అంతా చీకటి. తలుపు తీసే ఉండటం తో అరే నిరంజన్ అని పిలిచాను.
పిలిచిన వెంటనే వచ్చాడు ఓ కొవ్వొత్తి పట్టుకొని..

ఎంట్రా నీ ఒక్కఫ్లాట్ లోనే కరంటు పోయినట్టుంది అంటూ లోపలికి వెళ్లాను..
కాసేపాగి వస్తుందిలే అని అంటుండగా వాళ్లవిడ పెద్దకొవ్వొత్తి తెచ్చి టీపాయి మీద పెట్టి, నాకో నమస్కారం పెట్టి మా అవిడని,పిల్లవాడిని తనతో లోపలికి తీసుకువెళ్లింది.

సోఫాలో కూర్చుంటూ మీ ఒక్కఫ్లాట్లోనే కరంటుపోయిందేమిటిరా అన్నాను.

ఇప్పుడే వస్తుందిలే కూర్చోరా, సంగతులు చెప్పు ఎట్టా ఉన్నావ్ అన్నాడు.
బానే ఉన్నారా.. ఐనా ఎమర్జెన్సీ లైటన్నా లేకుండా ఈ కాండిల్స్ ఏమిటిరా అన్నాను?
కరంటు పోలేదు రా నేనే అన్ని లైట్లూ ఆపేశాను అన్నాడు..
అపేశావా ఎందుకు
గ్లోబల్ వార్మింగ్ రా అన్నాడు…
అప్పుడెప్పుడే ఆయిల్‍పుల్లింగ్ చుట్టుకున్నట్టు ఈ అంటువ్యాధి నీకూ బట్టుకుందా అన్నాను..ఓ వంకర నవ్వుతో…
అవును అన్నాడు…
ఐనా ఆ టీవీ వాళ్లదయ వల్ల మొన్నే అయిపోయిందిగా, ఇంకా ఇప్పుడేమిటీ అన్నాను

టీవీ వాళ్లు ఆ రోజు మాత్రమే చేశారేమో, నేను రోజూ చేస్తూనే ఉన్నాను అన్నాడు…
బాబ్బాబూ మా అబ్బాయి భయపడతాడు .. లైట్లు వెయ్యరా…
వాడు ఎక్కడ భయపడతాడో అని నువ్వు భయపడక వాడు చక్కగా ఆడుకుంటున్నాడు అన్నాడు..
లోపలికి తొంగి చూశాను, అద్దరు ఆడవాళ్లు తమ బడి ముచ్చట్లలో, ఇద్దరు పిల్లలూ ఆటలలో ఉన్నారు..
నాకు ఏమి చెయ్యాలో తెలియలేదు..
పోనీ అలా బయటకు వెళ్ళి లైటులో కూర్చొని మాట్లాడుకుందాం రారా అన్నాను..

నేను కావాలని చీకటిని కోరుకొని, లైట్లు ఆర్పేశాను రా.. నా ఇంట్లో ఆపేసి వెరే లైటు దగ్గరో , జనరేటర్ వాడాటానికో, షాపింగ్‍మాల్‍కివెళ్ళటానికో కాదు అన్నాడు.

అసలు నువ్వు ఓ గంట ఆపెయ్యటం వల్ల ఏమైనా లాభం ఉందా?
ఉంది. ఓ గంటపాటు భూతాపానికి నా పాపం జోడించటంలేదు… …
ఓ గంట, దానివల్ల ఏమిటి ఉపయోగం..
ఈ గంట ఆపివేసి కూర్చోవటం వల్ల, నేను – ఈ భూతాప సమస్యని రోజంతా నేను మర్చిపోను..
అందువల్ల ఒరిగేదేముందిట?
అందువల్ల నా జీవనవిధానం లో నే మార్పువచ్చింది…
ఏమిటో..

కాంటీన్ కో లైబ్రరీకో వెళ్లినపుడు నాకోసం ప్రత్యేకం లైటు, ఫాను వేసుకోకుండా అవి ఉన్న చోట ఇతరులతో పాటే కూర్చోవటం.బండిని పదే పదే బయటికి తీయకుండా.. బండి మీద వెళ్ళాల్సిన పనులన్నీ రోజుకి ఒకేసారి చేయటం..

నీ పిసినారి తననానికి పెద్ద పెద్ద పేర్లు ఎందుకు పెడతావ్ చెప్పు…

కరంటు విషయం లో నాది పినిసిగొట్టు అనటం అవివేకం.. కాలేజీ రోజుల్లో ఊళ్లలో రోజుకి పది గంటలుదాక కరంటు కోత ఉండేది.. పంటలకుఉ నీళ్లు పెట్టుకోలేక రైతులు అల్లాడేవారు.. నీబొటి వాళ్లేమో కరంటు ను దుబారా చేసావారు… ఇప్పుడు అదే పరిస్థితి తోడు ఈ గ్లోబల్ వార్మింగు కూడాను..

నా దగ్గర డబ్బులున్నాయి నేను దుబారా చేస్తాను….

నీ డబ్బులని నువ్వు దుబారా చేసుకో, కానీ, భూమి, నీరు, విద్యుత్ శక్తి.. ఇవి జాతీయ వనరులు… మన భారతదేశం లో నీటీ కొరత , విద్యుత్ శక్తి కొరత ఎంతవుందో తెలియకుండా ,ఈ రెంటీనీ దుబారా చేశావాడు సంఘ ద్రోహే నాదృష్టిలో.
డబ్బు దుబారా సేస్తే తిరిగి సంపాదింకుంటావేమో ,ఇవి ఓ సారి ఖర్చు సేసిన తరువాత దక్కనుకూడా దక్కవు.
ఎందుకు దక్కవు డబ్బులుపడేస్తే దక్కుతాయి…
వందేళ్ల క్రితం భాగ్యనగరానికి ఆనుకొని ‘మూసీ’ అనే మంచినీటి నది ఉంది…ఆ నదిని మళ్లీ తీసుకురావటానికి ఎన్ని డబ్బులు పడేస్తావ్?
….
రాయలసీమ ఎడారిగా మారకుండా ఉండటానికి ఎన్నిడబ్బులు విసిరేస్తావ్?
అవన్నీ గవర్నమెంటు చూడాలిరా..
గవర్నమెంటు చూడాలి.. చూడాకపొతే వాళ్లని ఐదేళ్ల తరువాత దింపేయాలి.. ఇంకోపనికిమాలిన వాళ్లని ఎక్కించాలి.. అంతే గాని ఇంకేంచేయనంటావ్…
చస్… చేయకపోవటం ఎందిరహే.. హాపీ గా చేశావాడిని.. మా తాతయ్య వందెకరం జల్సాలకి తగలెట్టాడు.. లేకపోతే.. అందులో హాపీగా పంటలుపండిచ్చుకుంటూ మా ఊళ్లో కాలుష్యం లేని చోట హాపీగా బతికి,.. మీ ఆహారకొరతకూడా తీర్చేవాడిని…
మీ తాతయ్య నీకన్నాచాలామంచి వాడు తెలుసా..
పేకాటికి, తిరుగుళ్లకి తగలేసి కొడుకులకి మనవళ్లకి డబ్బులు లేకుండా జేసినవాడు మంచోడారా నీకు?…
ఆయన డబ్బులు లేకుండా చేశాడేమో గానీ, మంచినీరు, మంచి గాలీ.. ఇచ్చాడు.. భూమి మీద మనుషులు నివసించలేని పరిస్థితి కల్పించలేదు…
కానీ ఇవాళ నీ జీవన విధానం వల్ల… రెండు తరలా తరువాత … మంచినీళ్లకి పెట్రోలుకన్నా కష్టపడాలిసివస్తే, ఇవాళ మంచి నీళ్లు కొనుక్కుంటునట్టు మంచి గాలి కూడా కొనుక్కోవాల్సి వస్తే.. నీవు భూమి మీద వదిలే అధిక వ్యర్ధాలవల్ల…వాళ్లకి పుట్టకతోనే జబ్బులొస్తే, వాళ్లు నిన్ను ఎంత తిట్టూకోవాలీ….
ఏమి బదులు చెప్పాలో తెలియక బిక్కమొహం వేసి ఆలోచిస్తుంటే.. ఆదుకోవటానికా అన్నట్టు అర్ధాంగి వచ్చింది..
ఏమండీ రెండు వీధులవతల మా ఫ్రెండు అనూరాధ ఉంటుందిట, అడ్రస్ తీసుకున్నాను వెల్దాంరండి, చిన్నప్పుడు దానికి కన్నా నాకు అందగాడు దొరుకుతాడాని పందెం వేశాను…
వెళ్లొస్తాం రా అని చెప్పి లేచాను…
నేను చెప్పిన దాని గురించి సీరియస్ గా అలోచించు అన్నాడు…
కారు రోడ్డుక్కుతుంటే, ఇంటి దగ్గర స్విచ్ ఆఫ్ చేయకుండ వచ్చిన కంఫ్యూటర్, ఆ గదిలో లైటు, హాల్లోనూ , కిచన్ లోనూ వెలుగుతున్న లైట్లు, బోర్డ్ దగ్గర ఆఫ్‍చేయకూండా రిమోట్ తో ఆఫ్‍చేసిన టీవీ,వీసిడిప్లేయర్ పొద్దున సతీమణి బట్టలు వాషింగ్ మెషీన్ డ్రయర్ లో వేయటం కళ్లముందు కదిలాడాయి..

మీ ఫ్రెండింటికి మరెప్పుడన్నా వెళ్దాం .. ముందు ఇంటికి వెళ్లాలి అన్నాను…

మీ ఫ్రెండు మీకు ఏదో బ్రెయిన్ వాష్ చేసినట్టున్నాడు అంది…
బ్రెయిన్ వాష్ కాదు ‘బగ్ ఫిక్స్’ చేశాడు అన్న మాటలు నా పెదవులమీదే అగిపోయాయి…

Advertisements

8 Responses

 1. సూపరు. దంచేశారు, ఊక దంపుడు గారూ…

 2. భలే హాస్యంగా చెప్పాల్సింది చెప్పేసారు ఊకదంపుడు గారు.

 3. Excellent!

 4. చాలా బాగా రాశారు. భూతాపం గురించి ఇంత సింపుల్ గా తెలియజెప్పిన నిరంజన్ అభినందనీయుడైతే మీరు అనుసరణీయులు. మార్పుకు ఒక మాట (ఇక్కడ ఒక సంభాషణ),లేక ఒక్క ఘటన చాలు అన్న నా నమ్మకానికి మీరు నిలువెత్తు ఉదాహరణగా మారారు.

 5. మీ నిరంజనోపాఖ్యానం చాలా బాగుంది.

 6. మీ నిరంజనోపాఖ్యనం చాలా బాగుంది.

 7. మీరు ఈ విధంగా బత్తీబంద్ ద్వారా భూ తాపాన్ని తగ్గించడానికి చేస్తున్న కృషి చాలా అభినందనీయం. చాలా చక్కగా, చిన్న కధ ద్వారా మీరు అందరికీ అందించిన సందేసం బహు ఆచరణీయం.

 8. సూటిగా చెప్పదలచుకొన్న విషయాన్ని మంచి సన్నివేశాల మద్య, అక్కడక్కడా హాస్యపు తునకలు పంచుతూ చాలా బాగా చెప్పారు.

  బొల్లోజు బాబా

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: