సామాన్యుడి సణుగుడు

తెలుగు బ్లాగ్లోకంలో రానారె ని పరిచయం చెయ్యడమంటే గోకులానికెళ్ళి నల్లని వాడు పద్మ నయంబులవాడు పద్యం చదివినంత హాస్యాస్పదంగా ఉంటుంది.

ఒక పక్క కాల్చిన చెనక్కాయలంత కమ్మటి కడప మాండలికంలో కతలు చెప్తా వుంటాడు. ఇంకో పక్క తన అమూల్యాభిప్రాయాల్నీ, పద్యకవిత్వాన్నీ పండిస్తుంటాడు. అందరూ ఆలోచించినట్టు చించి, రాసినట్టు రాస్తే ఆయన రానారె ఎందుకవుతాడు .. ఆయన తీరే వేరు!
*** *** ***

శుభం పలకరా పెండ్లికొడకా అంటే పెండ్లికూతురుముండ ఎక్కడ? అన్నాడట వెనకటికెవడో. నా మాటలు కూడా అలాగే అనిపించవచ్చు మీకు. భూతాపమనేది ముంచుకొస్తున్న ప్రమాదమని అందరికీ తెలుసు. కానీ, అది నిజంగా వచ్చి ముంచే వరకూ జనాలకు గానీ, ప్రభుత్వాలకు గానీ కదలిక రాలేదు. అగ్రరాజ్యాలైనా, అభివృద్ధి చెందుతున్న రాజ్యాలైనా పరిస్థితి ఈ విషయంలో మాత్రం ఒకటే. మన బత్తీబందుల్లాగే ప్రపంచవ్యాప్తంగా జనం ఏదో చెయ్యాలని తాపత్రయపడటమేకానీ …

భూతాపం విషయకంగా నేనేం చేయగలను అంటే – కొన్నికొన్ని చెయ్యొచ్చు. కానీ చెయ్యను.

  • నేను టీవీకి బానిసనని తెలిసి దాన్ని కొనుక్కోడం మానలేదు. చప్పిడి కార్యక్రమాలు చూస్తూ రాత్రంతా మేలుకుంటాను కానీ టీవీనీ కంప్యూటరునూ కట్టెయ్యను.
  • వేసవిలో కూడా చన్నీళ్ల స్నానం చెయ్యను.
  • ఆఫీసు నాకు దగ్గరే అయినా కార్లోనే వెళ్తాను, సైకిల్ మీద వెళ్లను.
  • పల్లెలో వున్నప్పుడు ఫ్యాను కూడా లేని నేను – పట్నం చేరాక ఏసీకి అలవాటుపడిపోయాను. దాన్ని ఆపితే భూతాపం తగ్గుతుందని తెలుసు కానీ వేడిని భరించను.
  • ఇంట్లో విద్యుత్ పరికరాలను కొంత పొదుపుగానే వాడతాను – ఎంత పొదుపు అంటే – విద్యుత్ బిల్లులు కట్టేందుకు నాకు గల స్థోమత అంత.
  • నీటిని పొదుపు చేయాలని తెలుసు కానీ బకెట్ నీళ్లతో స్నానం ముగించను. షవర్ వాడతాను.
  • ప్లాస్టిక్, పోలిథీన్ విరివిగా వాడుతున్నాను.

ఇలాంటి నేను బత్తీబంద్ కోసం ఏమిరాయను? నిజానికి – బత్తీబంద్ నన్ను ఆకర్షించిన అంశం కాదు.

  1. అసలే రోజుకు ఐదారుగంటలపాటు కరంటు వుండని హైదరబాదులో ఒక గంట లైట్లార్పి భూతాపాన్ని కొంతైనా అరికట్టామనుకోవడం సరైన ఐడియా అనిపించలేదు.
  2. అసలే నేరాలెక్కువైపోతున్న భాగ్యనగరంలో – రాత్రిపూట లైట్లార్పితే ఏమీ ఒరగదు సరికదా దొంగతనాలు జరిగే అవకాశలెక్కువని నాకనిపిస్తోంది.
  3. హైదరాబాదులో లైట్లార్పి మిగిలించిన కరెంటును మరో చోటికి మళ్లించి ఖర్చుచేస్తారంతే కదా! అని నాకనిపిస్తుంది.

తలనొప్పి వస్తే జండూబామ్ రాసుకుంటాం, కాస్త ఊపిరాడి నిద్రపడుతుందని. కానీ తలనొప్పికి మూలకారణమేమిటో ఆలోచించి దానికి తగిన చికిత్స చేసుకోకపోతే మళ్లీ మళ్లీ తలనొప్పి వస్తూనే వుంటుందికదా! బత్తీబందు అనేది ఒక జండూబామ్ లాంటిదని అనిపిస్తోంది. భూతాపనివారణకు ఇది మార్గమౌతుందా? భూతాపానికి గల నిజమైన కారణాలేమిటో సామాన్యునికి అర్థమయ్యేలా చెబుతుందా? ఒక గంటసేపు లైట్లార్పమని కాకుండా నిజంగా సామాన్యుడేం చేయాలో చెబుతుందా? ఇది చెప్పే నివారణోపాయాలు ఆచరణ సాధ్యాలేనా?

ఏదేమైనా బత్తీబందు లాంటి initiatives వల్ల “భూతాపమనే సమస్య ఒకటుంది బహుపరాక్” అని జనాన్ని హెచ్చరించవచ్చునేమో. కానీ ఈ హెచ్చరికలవల్ల లాభంలేదనిపిస్తుంది. ఎందుకంటే భూతాపం గురించి తెలిసినా పట్టించుకునేవారు మరీ తక్కువ. సమస్య తెలిసి, కనీసం తమవరకూ తామేం చెయ్యగలరో తెలిసీ చెయ్యని (నాలాంటి) వాళ్లే ఎక్కువమంది. ఈ ఎక్కువమందిని మార్చడం బత్తీబందువల్ల జరిగేపనేనా?

ఇదండీ భూతాపం గురించి నా ప్రవర్తన. ఇలాంటి విషపు ఆలోచనలు నిండిన నన్ను భూతాపం గురించి ఏం రాయమంటారు?

3 Responses

  1. బాగుంది.చాలా బాగుంది.చాలా చాలా బాగుంది.

  2. You are right
    We should change from basics

  3. భూతాపం బహు పరాక్ అంటూ చెప్తూనే, కోపాలు తాపాలు భూమికి కూడా సహజమే అని ఎంతో సహజంగా చెప్పి, పరిష్కారమార్గాన్ని, మనిషిలోని సహజ లోపాల్తో ముడిపెడ్తూ, రాస్తే, రాటుదేలిన రాళ్ళయినా, రాజీకి రావాల్సిందే అన్నంత రస రమ్యంగా రాసారు రానారే గారు .

Leave a comment