• Categories

 • Blog Stats

  • 9,939 hits
 • Advertisements

శంఖం పూరిద్దాం

సంక్లిష్టమైన సంస్కృత చమత్కారాల నుండీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల శధక బాధకాల దాకా సాధికారంగా, సరసంగా చర్చించగల దిట్ట నాగమురళి గారు ఇలా అంటున్నారు.

భూవాతావరణం వేడెక్కుతున్నదనీ, దాని ఫలితంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు రాబోతున్నాయనీ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇలా జరగడానికి మనుషులే కారణం అని ‘చాలా మటుకు’ నిశ్చయంగా చెప్పవచ్చునని కూడా అంటున్నారు. ఇప్పటికే వాతావరణంలో చేరిన గ్రీన్ హౌస్ వాయువుల పరిమాణాన్నీ, ఇప్పటికీ మనం వాటిని విడుదల చేస్తున్న తీరునీ పరిశీలిస్తే రాబోయే ఒకటి రెండు దశాబ్దాల్లో పరిస్థితి అదుపు తప్పి, ఇంక ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుందిట. ఇప్పటికే ఆలస్యమైంది, ఇంకా కళ్ళు తెరవకపోతే భవిష్యత్తు అంధకారమే.

ఇటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉంటే మనం ఇంచుమించుగా ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నామని అనిపిస్తుంది నాకు. సైంటిస్టులు చెప్పేది నిజమే అయితే, మనం ప్రమాదం అంచుల్లో ఉన్నాం. అయినా దీని గురించి అసలు ఎంతమందికి తెలుసు? చదువుకున్న వాళ్ళలోనే దీని గురించి పట్టించుకునేవాళ్ళ సంఖ్య స్వల్పం. పట్టించుకున్నా ఒక వ్యక్తిగా ఏమి చెయ్యగలం, ఎంతవరకూ చెయ్యగలం అన్నదానిమీద అవగాహన ఉండేవాళ్ళ సంఖ్య ఇంకా చాలా స్వల్పం.

ఇంట్లో విద్యుత్తు ఆదా చెయ్యడం, ఇంధనాల్ని పొదుపుగా వినియోగించడం, వస్తువుల్ని రీసైకిల్ చెయ్యడానికి ఇవ్వడం, వాతావరణానికి హాని చెయ్యని వస్తువుల్ని మాత్రమే వినియోగించడం బాధ్యతగల పౌరులు చెయ్యాల్సిన పనులు. వీటి గురించి నాకు కొంత అవగాహన ఉన్నప్పటికీ చాలామటుకు నిర్లిప్తమైన భావనే కలుగుతుంది గానీ, ఒక ‘అవసరం’, ‘తొందర’ కలుగవు. ఎందుకంటే – ఒక వ్యక్తిగా, లేక కుటుంబంగా నేను వినియోగించుకునే వనరులు చాలా స్వల్పం. చేతనైనంతలో పొదుపుగానే ఉంటాము కదా, ఇంకా చాదస్తంగా వీటి గురించి పట్టించుకోవడం ఎందుకు అన్న భావం నిర్లిప్తతకి కొంతమటుకు కారణం. అందరూ చేస్తున్నప్పుడు మనమూ చేద్దాములే అన్నది ఇంకో భావం. నేనెంత చేసినా సముద్రంలో కాకిరెట్ట అన్నది ఇంకో అభిప్రాయం.

అసలొకవ్యక్తిగా నేను ఎంత చేస్తే మాత్రం లాభం ఏమిటి? ప్రభుత్వాలేమి చేస్తున్నాయి? ఇరవై సంవత్సరాల కాలంలో విపత్తులు ముంచుకొని వస్తూ ఉంటే, వాటికి లేని బాధ్యత నా ఒక్కడికీ ఎందుకు అని కూడా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. అసలు ఇటువంటి భౌగోళిక విషయాల్లో ప్రభుత్వాలు కల్పించుకుంటేనే ఏమైనా చెయ్యడానికి సాధ్యం అవుతుంది. అవిమాత్రం మొద్దు నిద్దర పోతూ ఉంటాయి. భవిష్యత్తు వాటికి అక్కరలేదా?

అక్కరలేదు అనే అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రభుత్వాలు ఐదేళ్ళకన్న ఎక్కువకాలం ఉండవు. ఉన్నంతకాలం కూడా రాజకీయ క్రీడల్లో వాటికి ఊపిరి సలపదు. దార్శనికుల్లా ప్రవర్తించే పాలకుల కోసం మనం కలలు కనడం అమాయకత్వం. కాబట్టి మనమే అంకుశం చేతపట్టి ప్రభుత్వాల మెడలు వంచి అవి వేగంగా, నిర్ణయాత్మకంగా వ్యవహరించేట్టు చేయాలి. ముంచుకొస్తున్న పెనుప్రమాదాల గురించి అవగాహన ఉన్న ప్రపంచ పౌరులంతా ఏకం కావాలి. సంఘటితంగా ప్రభుత్వాలమీదా, వాణిజ్య సంస్థలమీదా ఒత్తిడి తేవాలి. ఇటువంటి ఆలోచన ఒక్కటే నాకు కొంచం ఆశనీ, స్ఫూర్తినీ కలిగిస్తుంది. అసలంటూ ఏదో ఒకటి మనం చెయ్యగలం అన్న ఆశ కలిగితే, మన భూమిని మనం కాపాడుకోడానికి మన జీవనశైలిలో కొద్దిగా మార్పులు చేసుకోడం పెద్ద కష్టమేమీ కాదు. కావలసింది కొంచం స్ఫూర్తీ, అవగాహనా, అంతే.

బత్తీ బంద్ గురించి చదివాను. మొన్నామధ్య లండన్ లో కూడా ఒక గంట లైట్లు ఆర్పెయ్యమని ప్రచారం చేశారు. ఎవరూ పట్టించుకోలేదు. పెద్ద పెద్ద ఆఫీసులుండే కెనరీ వార్ఫ్ ఏరియాలో కూడా కనీసం ఒక్క గంటసేపు బిల్డింగుల్లో లైట్లు తియ్యడానికి ఎవరూ పూనుకోలేదు. అటువంటి నిర్లిప్తత నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. ఆధునిక ప్రపంచపు ఆలోచనల్ని శాసిస్తున్నది మీడియా. ఈ సమస్య నిజంగా అందరూ అంటున్నంత తీవ్రమైనదే అయితే మీడియా ఇంకా చాలా ఆవేశం చూపించాల్సి ఉంటుంది అని నా అభిప్రాయం. అంతవరకూ పెద్దగా మూలాలేమీ కదిలిపోవు.

అయితే బత్తీ బంద్ ప్రజల్లోంచి పుట్టిన ఉద్యమం కాబట్టి ప్రజలే దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ప్రజలేం కావాలని కోరుకుంటున్నారో ప్రభుత్వాలూ, మీడియా కూడా అవే ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి. చిన్న చిన్న చినుకులే చివరికి తుఫానుగా మారుతాయి. అవసరం మనది. మనందరిదీ. మన పిల్లలది. రాబోయే తరాలది. వాళ్ళకో భవిష్యత్తు కావాలి. దానికోసం ఆ మాత్రం మనం చెయ్యలేమా? కాబట్టి కనీసావగాహన ఉన్నవాళ్ళెవరూ నిర్లిప్తంగా ఉండకూడదు. నేనూ ఇహ ముందునుంచి ఉండనని నిర్ణయించుకుంటున్నా. అందరం కలిసి ఏదో ఒకటి చేద్దాం.

చెవిటి ప్రభుత్వాలకి వినిపించేంతవరకూ శంఖం ఊదుతూనే ఉందాం.

Advertisements

3 Responses

 1. acha altlanamari

 2. వ్యాసం చాలా బాగుంది. బత్తి బంద్ ద్వారా చేయీ చేయీ కలుపుదాం. ఈ మెసెజ్ ను పదిమంది తోను పంచుకుందాం.
  బొల్లోజు బాబా

 3. నాగమురళి గారూ,
  మనం ఏ ప్రభుత్వాల కోసమో ఆగకుండా మన వైపు నుండి చిన్న చిన్న వాటి ద్వారా ఆరంభించ వచ్చు.

  నాకు తోచిన కొన్ని ఉపాయాలు (?) కింద ఉదహరిస్తున్నాను.
  1. షాపుల్లో సామాన్లు కొని తెచ్చుకొనేప్పుడు ప్లాస్టిక్ కవర్ల వాడకం తగ్గించండి (2, 3 పదార్థాల కోసం ఓ కవర్ అన్నట్టుగా)
  2. మీకు కార్ ఉంటే, ఆఫీసుకెళ్ళేప్పుడు వీలయితే మీ స్నేహితులనెవరినైనా తోడు తీసుకెళ్ళండి.
  3. మీకు సొంత ఇల్లు ఉంటే, ఓ చిన్న మొక్కనైనా నాటండి.
  4. పగటి పూట గాలి కోసం ఫాన్లను కాకుండా మీ ఇంటి కిటికీలను తీసి ఉంచండి.
  5. మీకు పీసీ ఉంటే, మీరు వాడని సమయంలో ఆఫ్ చేసి ఉంచండి.

  ఇంకా ఎన్నో తెలిసుంటాయి మనకు..వీటిని మనమే కాన్షియస్ గా పాటించి మనతోనే ఆరంభిద్దాం.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: