అవని ఏమంది?

కేంద్రపాలిత ప్రాంతం యానాం నించి ఈ మధ్యనే బ్లాగువనంలో తనకవితా గళం విప్పిన కోకిల బొల్లోజు అహ్మదలీ బాబా గారు .. ఈ అవని ఏమన్నదో వినమంటున్నారు.

అవని ఏమంది?

చిల్లులు పడిన ఒజోను దుప్పటిని కప్పుకుని
పీలికలైన పచ్చని చీరను చుట్టుకొని
నీళ్లలో తడిచి ఒరిసి పోయిన పాదాలతో
తీవ్రమైన జ్వరంతో వణుకుతున్న
అవని ఏమంది?

కుచించుకుపోతున్న అడవులు
వాహనాలు వెదచిమ్ముతున్న విషాలు
ఎడారులయ్యే పంటభూములు
తీరాలను ముంచెత్తే సాగరాలు
వ్రణాలు పడుతున్న పర్యావరణం…….
బిడ్డా ……. కళ్లుతెరు…. కళ్లుతెరు అంది.

అవని ఏమంది?
సూర్య, పవన, జలశక్తులను మచ్చిక చేసుకొని
రాక్షసబొగ్గు రాక్షసత్వానికి దూరంగా ఉండమంది.

నడక, సైకిలు, ప్రజారవాణా వ్యవస్థల ద్వారా
శిలాజ ఇంధన హోమాన్ని నిలువరించమంది.

స్విచ్ ఆఫ్ చేసినా, స్టాండ్ బై లో ఉంచినా
పరికరాలు పీల్చుకొనె లవలేశ శక్తినీ
అన్ ప్లగ్ చేసి అరికట్టమంది.

ఫిలమెంటు బలుబుల వేడి వెలుగు స్థానంలో
ఫ్లోరెసెంట్ కాంతుల వెన్నెలను పూయించమంది.

స్విచ్ నైనా, కుళాయినైనా, “అయితే ఏంటటా?” అనే నిర్లిప్తతనైనా,
లేచి వెళ్లి కట్టేయటానికి బద్దకించవద్దన్నది.

అవని ఏమంది?
నియంత్రించబడలేని విషవలయంలోకి పోయి
మిమ్మల్ని మీరే తొలగించుకోవద్దంది.

ఒక్క క్షణం ఆపమంది
ఉక్కిరిబిక్కిరవుతున్న తాను
ఊపిరి తీసుకోవటానికి.
ఒక్కక్షణం ఆర్పమంది
ఎక్కుతున్న తన కంఠం
గుక్కతిప్పుకోవటానికి

అవని ఏమంది?
ఒక్కక్షణం ఆపమంది
ఒక్కక్షణం ఆర్పమంది.
ఒక్కక్షణం ఆపమంది
ఒక్కక్షణం ఆర్పమంది.

3 Responses

  1. బాబా గారు: మీరు యానం లో ఉన్నార, రెండురోజుల క్రితమే నేను యానం బీచ్ కి వచ్చాను.. చాలా బాగుంది ఆ బీచ్, ఆ శివలింగం, అవని గ్లోబల్ వార్మింగ్ గురించి చెప్పిన మీ కవిత చాలా బాగుందండీ.

  2. Poetry on Global warming is good

  3. బాగుందండి. ముఖ్యంగా అవనిని …
    “చిల్లులు పడిన ఒజోను దుప్పటిని కప్పుకుని
    పీలికలైన పచ్చని చీరను చుట్టుకొని” అని పోల్చటం బాగుంది.

Leave a Reply